Monday, 23 January 2012

నా..కవితలు..కొన్ని..

అద్దాల సౌధం...!

యానాం ఘటన ఎవరికి గుణపాఠం (Andhra prabha, 28Feb.2012)
  
మనిషి సంఘజీవి. సంఘంలో భిన్నప్రవృత్తులు, స్వభావాలు, మానసిక సంవేదనలు ఉంటాయి. వీటిని అంటి పెట్టుకుని రాగద్వేషాలు, అసహనం, ఈర్ష్యలు ఉంటాయి. సమాజాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైతే అనేక దుష్పరిణామాలు దాపురిస్తాయి. అదుపుతప్పి మొత్తం వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే పరిస్థితి వస్తుంది విధ్వంసం... కల్లోలం.. ఆవేశం.. అరాచకం.. ప్రబలినప్పుడు కలిగే నష్టం ఇంతా అంతా కాదు. యానాం సంఘటన వల్ల జరిగిందదే. ఇలాంటి వాటిని చూస్తే ఒక రాయి వేస్తే బద్ధలయ్యే అద్దాల మందిరంలో ఉన్నామనిపిస్తుంది. అంతాచేసి ఒక గంటలో (ఇంకా తక్కువేమో) వినాశనం జరిగిపోయింది. రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒళ్ళు గగుర్పాటు కలిగించి యానాం చరిత్రలో మాయని మచ్చలా మిగిలిపోయింది. యానాం ఎలాంటిది?
ఆహ్లాదకరమైన ప్రదేశం. ప్రశాంతతకు మారుపేరుగా ప్రాకృతిక సౌందర్యంతో అలరారే సుందర ప్రాంతం. దానికి తోడు ప్రభుత్వ నిధులు, రిలయన్స్‌ నిధులతో పర్యాటకరంగంగా చెప్పుకోదగిన విధంగా తీర్చిదిద్దబడింది. ఇంకా అనేక ప్రణాళికలతో ముందు ముందు దేశపటంలో ఒక స్థానాన్ని సంపాదించే దిశగా పరుగులు పెడుతూంది.
భౌగోళికంగా తూర్పుగోదావరి జిల్లా అంతర్భాగంగా ఉండి పరిపాలనాపరంగా పుదుచ్చేరీ కేంద్ర పాలిత ప్రాంతానికి చెందినది యానాం. రాజధాని నగరం పుదుచ్చేరి ఇక్కడ నుండి 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. పుదుచ్ఛేరి, కారైకాల్‌లలో తమిళం, మాహేలో మలయాళం, యానాంలో తెలుగు భాషలు మాట్లాడతారు.తమిళ ప్రాబల్యం గల పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో తెలుగువాడు (మల్లాడి కృష్ణారావు) మంత్రిపదవి దక్కించుకోవడం గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే తొలిసారి జరిగింది. స్వయంకృతాపరాధం వల్ల 2011లో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయింది. నిరాడంబరుడు, కామరాజ్‌ నాడారు అనుంగు శిష్యుడు అయిన ఎన్‌.రంగసామి నిరాదరణకు గురై కాంగ్రెస్‌కు దూరంగా జరిగి పార్టీ పెట్టిన మూడు నెలల వ్యవధిలో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం ఈయన ప్రభుత్వం యానాం పట్ల సవితి తల్లి ప్రేమ చూపెడుతూంది. అది అలా ఉంచితే, ఎనభైయవ దశకంలో కోన ప్రభాకరరావు లెఫ్ట్‌నెంటు గవర్నరుగా ఉన్నప్పుడు ఇక్కడి ప్రభుత్వ రాయితీల గురించి ప్రచారం జరిగి ఆంధ్ర ప్రాంత పారిశ్రామికవేత్తలు ఆకర్షితులై యానాంలో అనేక పరిశ్రమలు నెలకొల్పారు. యాజమాన్య కార్మిక సమస్యలతో కాకుండా ఇతరేతర కారణాల వల్ల చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. ఆరంభంలో కొన్ని ఒడుదుడుకులు ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ నిలదొక్కుకుంది రీజెన్సీ ఒక్కటే. అంతర్జాతీయ ప్రమాణాలతో టైల్సు తయారు చేసి యానానికి గుర్తింపు తెచ్చింది. పరిశ్రమకు కావలసిన ఇతర ముడిపదార్థాలు, రవాణా కోసం అనేక అనుబంధ పరిశ్రమల్ని ఏర్పాటు చేసుకుంది. రిగ్మా పేకింగు, ట్రాన్స్‌పోర్టు ఇంకా అనేకం అందులో భాగమే. అంతేకాకుండా రీజెన్సీ సిరామిక్స్‌ ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగుల పిల్లల కోసం ప్రాథమిక పాఠశాలతో ప్రారంభించి హైస్కూలు, జూనియర్‌ కాలేజీ, ఇంజనీరింగ్‌ కళాశాల, ఎంసిఏ, ఎబిఏ లాంటి ఉన్నత విద్యను అందించింది. ఫ్యాక్టరీ ఉద్యోగుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించింది. ఇంకా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని సహాయం అందించింది. ఇదంతా ఒక పార్శ్యం. యానాం చరిత్రలో జనవరి 27 తేదీ ఒక దుర్దినం. అదుపుతప్పిన మానవప్రవృత్తికి, పేట్రేగిన రాక్షసత్వానికి ప్రతీకగా మిగిలిపోయింది. ప్రత్యక్షంగా పరోక్షంగా యానాంలోని సమస్త వ్యాపారాలమీద ఈ ఘటన ప్రభావం తెలిసిపోతున్నది. దగ్ధమైన బస్సులు, ఫ్యాక్టరీ శిథిలాలు అలాగే ఉన్నాయి. వీడియో ఆధారంగా చేస్తున్నారు. పోలీసు విచారణలో చెప్పుకోదగిన పురోగతి లేదనే చెప్పాలి. సంఘటనకు బాధ్యలు కానివారి పేర్లు నిందితుల జాబితాలోకి చేరడం వల్ల కేసులు నిర్వీర్యమైపోతుందనే భావన ఉంది. అది మనం మాట్లాడేది కాదు. చట్టం పని.
జరిగిన దుర్ఘటనకు యాజమాన్యం, కార్మికుల పాత్ర గురించి ఆలోచించి తప్పొప్పులను ఎంచడానికి ఇది సందర్భం కాదు. అలాగని ఏదో జరిగిపోయిందని వదిలేసేది కాదు. మొత్తం సంఘటన సమాజానికి ఏ విధమైన సందేశాన్ని పంపుతున్నది? అన్ని వేళలా హుందాగా సభ్యసమాజంలో నాగరికంగా మనుకునే వారు అవకాశం వస్తే ప్రవర్తన ఎలా మారిపోతుంది? నిస్సిగ్గుగా దోపిడీకీ నీచత్వానికి ఎలా ఒడిగట్టగలిగారు? ఒకపక్క విధ్వంసం... మరో పక్క అందింది అందినట్లే దోచుకునే మనస్తత్వం ఎక్కడ్నుంచి వచ్చింది. ముప్పై నలభైమంది ఆవేశపరుల ఒట్టి కర్రలు చేతబూని జరిపిన బీభత్సానికి అడ్డుకట్టవేయలేక పోవడం ఎంత దారుణం? పిల్లలు బస్సులో ఉండగానే అద్దాలు పగలగొట్టి అంటించగలిగేంత అమానుషత్వం వెనుక ఏ ప్రయోజనాలు దాగి ఉన్నాయి? ఎవరి సానుభూతి కోసం రీజెన్సీ విద్యార్థుల విలువైన రికార్డులు ఆహుతయ్యాయి? ఉపాధ్యాయుల సర్టిఫికేటులు, ఫర్నీచరు ధ్వంసం చేయడం కనీస వివేచన లేకుండా చేసిన పనులు కావా? శాంతి భద్రతల వైఫల్యాలుంటాయి. సమస్యలుంటాయి. తప్పులుంటాయి. వీటితోబాటు సామరస్యంగా పరిష్కరించుకోగలిగే మార్గాలూ ఉంటాయి. చట్టాన్ని తమ చేతుల్లో తీసుకుని విచక్షణారహితంగా ప్రవర్తించడం ఎంతవరకు సబబు? అలా చేస్తే ఫలితాలు ఇప్పట్లాగే ఉంటాయి. వేలాది మంది రోడ్డుమీద పడతారు. భవిష్యత్తు అంధకారమౌతుంది. పిల్లల చదువులు అర్థంతరంగా అటకెక్కుతాయి. అంతేనా?
స్థానికులు, వయసు మీరిన వారు మరోచోటుకి వెళ్ళలేరు. వెళ్ళినా ఫలానా కంపెనీ ఉద్యోగులుగా ఉపాధి లభించడం కష్టం కావచ్చు. ఒక వ్యక్తి నిబద్ధత, శీలం ఎవరికైనా మొదటి పెట్టుబడి, అది లోపిస్తే మనుగడ అసాధ్యం. తప్పుచేసినవారు కొందరే. కానీ ఆ భారాన్ని అందరూ మోయాల్సిన దుస్థితి ఇది. అందరూ కార్మికుల శ్రేయస్సునే కోరుతారు. సానుభూతి ఎపుడూ వారి పక్షాన్నే ఉంటుంది. ఉండాలి కూడా. నెలంతా కష్టపడి చాలీచాలని జీతంతో బతుకీడ్చేవారు వాళ్ళే. జరిగిన సంఘటనకు తక్షణ ప్రత్యక్ష బాధితులు వారే. వాళ్ళ గురించే అందరి ఆలోచన. రాజకీయ లబ్దికోసం ప్రాకులాడేవారికి చిక్కితే ఫలితాలు ఇలాగే ఉంటాయి.విధ్వంసాన్ని పునర్నిర్మించడం అవశ్యంగా జరగాల్సిందే. ప్రభుత్వం అండ సంపూర్ణంగా ఉండాలి. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలకు తావులేని విధంగా పటిష్టమైన విధానాన్ని ఆచరించాలి. ఉత్పత్తి నిరాటంకంగా సాగేందుకు అన్ని చర్యలు చేపట్టాలి. ఇది జరగనట్లైతే ఇకముందు కొత్తగా మరే పరిశ్రమ దరిచేరదని గ్రహించాలి.

-దాట్ల దేవదానం రాజు

హృదయ సంబంధి

  -దాట్ల దేవదానం రాజు

Andhra Jyothi-23Jan.2012
నీకూ నాకూ మధ్య
దూరమయ్యేంత దగ్గరతనం ఉంది
ఇది దాటొద్దు అని గీసే గీత
నన్నెప్పుడూ ఆపలేదు
ఏ అర్థాన్నీ మోయని
సంగీతం కూడా నాకు నచ్చుతుంది
అక్కడెక్కడో-
మిలమిల మెరుస్తూ కాంతి
పిలుద్దామంటే ఒకటే గొంతు
అలా సుతిమెత్తగా పట్టుకుని
వదిలెయ్యడానికే కరచాలనం
ఒక్క తన్మయత్వపు చూపు
జ్ఞాపకాల ఒడిలో నిద్రిస్తుంది
దేహం దాచే సత్యాన్ని
కళ్ళు చెబుతాయి
పైవన్నీ లబ్‌డబ్‌లే
పెనుచీకటి దిగులు
మెదడు నరాల్ని తాకుతుంది
నెత్తురు చిక్కదనం
హృదయ కవాటాలను మూసేస్తుంది
చాలించేందుకు క్షణం చాలు
ఎగిరే విమానానికి రెండింజనులు
మనిషికీ మరో గుండె ఉంటే
ఎంత బావుండును


- దాట్ల దేవదానం రాజు



దిగులు గీత

సూర్యుని తొలికిరణం
ముందుగా నిన్నే సోకిందా, అనామికా..
విడవలేక వెళ్తున్నట్టు
మలి సంధ్యలోని ఆఖరి కిరణమూ అంతే…
అల ఉవ్వెత్తున ఎగసి
నీపాదాల చెంతకురికి
నీకే పరిమితమైన స్వర కల్పనతో
ఆర్ద్ర సంగీతాన్నివినిపిద్దామనుకుంటుంది
ఉండుండి ఒక చేప పిల్ల
ప్రవాహం మీదుగా ఎగిరి
ఆకాశ విన్యాసం చేస్తూ
మౌనభంగం చేయాలనుకుంటుంది.
రాజీవ గాంధీ బీచ్ మధ్యగా వెలసిన
కంటికి సుతిమెత్తగా అగుపడే
ఏకశిలా విగ్రహం నీవు
రాత్రి కురిసిన బహిరంగ వానలో
గోదావరిలో జలకాలాడినట్టు
తడిసి ముద్దై మురిపిస్తుంటావు
గోదారి మీద అలిగినట్లు
తూర్పుకు అభిముఖంగా
చలన రహిత రాతి మనసుతో
తెలుగుదనాల వనంలో
మందలోంచి తప్పిన మేకలా
వలస వచ్చిన విదేశీ వనితగా
పీఠమెక్కి కూర్చున్నావు
వెన్నెల రంగరించిన లేపనం పూసుకుంటూ
సదా మత్తెక్కిన చూపులతో
మా ఊరి వలపుల చిరునామాగా
కనువిందు చేస్తావనుకున్నాను
సందర్శకుల చూపుల తూపులు
అంగాంగాల్నే స్పృశిస్తూన్నాయి
భారంగా కదులుతున్న దుఃఖ ఛాయల్ని
పట్టించుకునే వాడే లేడు
నీ వదనారవిందం లోని
మరోకోణాన్ని ముందుగా నేనే చూసాను
రాతి సొగసులోని
మూర్తీభవించిన దిగులు నీడలను
పసిగట్టింది నేనే
ఎంత దిగులు నింపుకుని చెక్కాడో
ప్రేమవైఫల్యాల శిల్పి
నాగుండెలోనూ
విషాద ఘంటికల్ని మోగిస్తున్నాడు
మొనాలిసా దోరనవ్వులొని
లేశ మాత్రపు సంతోషరేఖల్ని
ఇంకా కొలవనేలేదు
గేలమేసి ఆటాడిస్తున్న
ఈ అనామిక శిల్పం ముఖం మీద
గూడుకట్టిన దిగులు పొరను
లెక్కించడానికి ఎంతకాలం పడుతుంతో ?

(యానాం గోదావరి ఒడ్డున విదేశీ యువతి విగ్రహం చూసి…)

No comments:

Post a Comment