ఒక కవీ, కథకుని గురించి..
- శివారెడ్డి
నిజానికి ఈ కథలు చదవకముందు, దేవదానంరాజుని కథకునిగా పెద్ద impression లేకుండానే చదవటం మొదలెట్టా. ఆయన అంతకుముందు 2002లో అచ్చేసిన 'దేవదానంరాజు కథలు'గానీ, 'సరదాగా కాసేపు' రాజకీయ వ్యంగ్య కథలుగానీ మనసుపెట్టి చదవలేదో ఆయా కాలాల సందర్భాలనుబట్టి అవి నామీద అంత ముద్ర వేయలేదో తెలియదు. కథకుడిగా రాజు విషయంలో నేను చీకట్లో వున్నట్టే- ఏర్పరుచుకోవాల్సిన చనువు ఏర్పరుచుకోలేదనే- దిగాల్సినంత లోతుకు దిగలేదనే; దానికి కారణం ఆయన కవిగా యిచ్చినimpression వేసిన బలమయిన ముద్ర కారణం. దాట్ల దేవదానంరాజంటే కవే- త్వరత్వరగా ఎదిగొచ్చిన కవే- ఆలస్యంగా నాట్లు వేసినా పంట సకాలంలో చేతికొచ్చినట్టే. కాస్త ఆలస్యంగా సాహిత్య రంగప్రవేశం చేసినా- ఆ gap కనపడకుండా విరివిగా సృజన వ్యాసంగం జరిగింది.
ఒక ఆధునిక వ్యక్తీకరణ పట్టుకోవటంలో- అటు భావంలోనూ, యిటు భాషలోనూ సఫలీకృతుడయ్యాడు. ఆలస్యంగా మొదలెట్టినవాళ్ళకు వర్తమానపు వత్తిళ్ళ వల్లా, సంక్లిష్ట సందర్భాల వల్లా వస్తువు పుష్కలంగానే వుంటుంది. ఆ కాలానికనుగుణమయిన ఆధునిక వ్యక్తీకరణ కవసరమయిన భాష సంపాయించుకోవటంలో కొంచెం యిబ్బంది పడాల్సి వస్తుంది. తనదయిన అభివ్యక్తీ, తన భాష తాను సృష్టించుకోలేకపోతే, తనదయిన శైలీ నిర్మాణాలు సాధించటం కష్టమౌతుంది. దేవదానంరాజు ఆ gap కనపడనీయకుండా అటు భాషలోనూ ఇటు భావంలోనూ ఒక అత్యద్భుతమయిన ఆధునిక వ్యక్తీకరణ సాధించాడు. యిది అపూర్వం. తనదయిన కవిత్వ పరిభాష తను ఎన్నుకున్నాడు, సాధించాడు-1954లో పుట్టిన దేవదానంరాజు, మొదటి కవితా సంపుటి 1997 లో అతని 43వ ఏట అచ్చయింది.
అక్కడనుంచి 2012లో అచ్చయిన 'పాఠం పూర్తయ్యాక' అతని ఆరవ కవితా సంపుటి. అలాగే రెండు దీర్ఘ కవితలు రాశాడు. రైతు నేపథ్యం నుంచి ఎత్తుకున్న 'ముద్రబల్ల' 2004, వృద్ధాప్యపు క్లేశాల నేపథ్యం నుంచి వచ్చిన 'నాలుగోపాదం' 2010. అందుకని దేవదానంరాజు కవిగానే కళ్ళముందు మెదులుతాడు. అతను సర్వశక్తులు కేంద్రీకరించింది ఈ దశాబ్దంన్నరలో కవిత్వం మీదే- ఈ పదిహేను సంవత్సరాల్లో తన్నుతాను ఏ రకంగా సన్నద్ధం చేసుకున్నాడు, నిర్మించుకున్నాడు, మలుచుకున్నాడు- మొక్కవోకుండా- ఎలా నిలబడ్డాడు అన్నదే ముఖ్యం- ఎప్పుడు మొదలుపెడితే మాత్రమేమిటి? ఏ రకంగా పనిచేశావు ఏం సాధించావు అన్నదే ముఖ్యం. కవిగా దేవదానంరాజు అది సాధించాడు- ఖచ్చితంగా పేరు తీసేసి ఒక పద్యమిస్తే యిది దేవదానంరాజు పద్యమని గుర్తుపట్టగలిగిన తనదయిన ఒక ముద్రను సాధించాడు. అందుకని ఈ కథల సంపుటికి నాలుగు మాటలు వ్రాయమన్నప్పుడు నా మానసిక స్థితి ఏమిటి? రాజు కథకుడిగా నాకంతగా ఆనని దశ. అతని అధ్యయనం, సాధనాక్రమమంతా కవిత్వానికి సంబంధించినదేనని. కానీ ఈ కథా సంపుటిలో కథలన్నీ చదివాక మళ్ళా వెనక్కి వెళ్ళి 'దాట్ల దేవదానంరాజు' కథలు మళ్ళీ చదివాక- నా అభిప్రాయం తప్పని తేలింది.
నిజానికి దేవదానంరాజుని సాహిత్య లోకానికి పరిచయం చేసింది, ఈ వచన సాహిత్యమే. అతని సాహిత్యపు orientation అంతా వచన సాహిత్యం ద్వారానే. సాహిత్యం పట్ల అపారమయిన ప్రేమని ఒక లోలుసతనీ పెంచుకున్నదీ వచన రచనలు చదవటం ద్వారానే- 'దేవదానంరాజు కథలు'గానీ, 'యానాం కథలు'గానీ చదువుతుంటే, గొప్ప ఆనందం, ఆశ్చర్యం- నేననుకోవటం కథకుడికి, గొప్ప కథకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం- తనదయిన ఒక -Narrative -అద్భుతమయిన కథాకథన పద్ధతి. మన జానపద మౌఖిక కథకులు సాధించిన కథాకథన పద్ధతి, ఏదో యితనిలో యింకిపోయిందనిపించింది.
రైతాంగపు నేపథ్యం నుంచి వచ్చిన దేవదానంరాజుకివన్నీ కొత్తగాదు. తను కథకునిగా జన్మించాక, ఆ తొలినాళ్ళ రైతుకూలీల కథాకథన పద్ధతిని అందిపుచ్చుకున్నాడనిపించింది. ఆ జానపద కథకులు కథ చెప్పే పద్ధతిలో అంత రుచి ఎందుకు? అంటే- సరాసరి జీవితం నుంచి, జీవనానుభవం నుంచి ఒక చమత్కార భూయిష్టమయిన జాను కవిత్వ శైలిలో వాళ్ళు పలుకుతారు గాబట్టి- ఆ నేర్పేదో, ఆ కౌశలమేదో యితనిలో పరోక్షంగా యింకిపోయింది. ఎంత హాయి గా కథ చెబుతాడు. అతని కవిత్వమూ అంత హాయిగా సరళంగా సాంద్రంగా మన లోపలి వేళ్ళు కదిలిస్తూ-కవి, కథకుడూ- పరస్పర పూరకాలేమో, ప్రేరకాలేమో- కథ రాసేటప్పుడు కవి అంతర్లీనంగా వుంటాడేమో; కథ వింటాడేమో, తనూ వంత పలుకుతాడేమో- అలాగే కవిత్వం రాసేటప్పుడు కథకుడు అదృశ్య పాఠకుడేమో- ఒక కథాకథన స్పర్శ కవిత్వానికిస్తాడేమో- వీళ్ళిద్దరి మధ్యా ఒక అవగాహనా, అవ్యక్త అనుబంధముందేమో- అది చోదకశక్తిగా పనిచేస్తుందేమో- ఆ కెమిస్ట్రీ ఏమిటో, ఆ రసాయనిక చర్య ఏమిటో- మనకు తెలియదుగానీ- పాఠకుణ్ణి లోగొనే ఒక శక్తి, అలా వెంట తీసుకుపోయే ఒక ఆకర్షణ వుంది. అందుకని కథకునిగా రాజు- కవిగా రాజుతో సమానుడే. ఆశ్చర్యం గొలిపే ఒక శైలీ సంవిధానం వుంది- ఆయనదే అయిన ఒక కంఠస్వరం వుంది. దీనికంతకీ నేపథ్యం ఆయన రాయకుండా ఉన్న 40 ఏళ్లలో వుంది. తను పుట్టి పెరిగిన భౌగోళిక జీవన నేపథ్యంలోనూ, తనదే అయిన ఒక అనుభవంలోనూ వుంది.
ఈ కథలన్నింటిలోనూ ప్రత్యక్ష పరోక్షంగా యానాం వెన్నెముక వుంది. యానాం ప్రాణముంది. యానాం గాలి, యానాం వెలుతురు, యానాం పరిమళం వుంది. యానాందే అయిన స్పర్శ వుంది. జీవధార వుంది. ప్రాదేశికత, నిర్దిష్టత- కేంద్రమే. అయినా కవితగానీ కథగానీ అక్కడే నిలవదు. అది, ఆ నిర్దిష్ట సందర్భం నుంచి, సంఘటన నుంచీ, అనుభవం నుంచీ పుడుతుంది, పెరుగుతుంది, విస్తరిల్లుతుంది, క్రమంగా విశ్వమంతా అల్లుకుంటుంది.
'తోడుదీపం' కథని ఒక్క యానాంలోనే ఫిక్స్ చేయలేదు. విశ్వజనీనానుభవం అవుతుంది. సాహిత్యం ఎల్లలు దాటటమంటే యిదే. ముఖ్యమైన మానవ సారాన్నిదేన్నో అది తడుతుంది,మేల్కొల్పుతుం ది. మానవ సంబంధాల్లో వున్న గాఢతని, ఐక్యతని, ప్రేమనీ పంచుకునే తత్వాన్ని అది అద్భుతంగా అందిస్తుంది. ఒక పరిపక్వ దశలో కవిత్వం అందుకున్నాడు, కథనందుకున్నాడు - అతని అధ్యయనం, ఆలోచన, ఆచరణ- అనురాగపు స్పర్శ- అన్నింటినీ సువర్ణంగా మార్చే శక్తినిచ్చింది. తన్ను తాను విమర్శించుకుని, విశ్లేషించుకుని, విభాగించుకుని మళ్లీ ఐక్యం చేసుకునే ఒక విధానాన్ని రాజుగారు తన కవిత్వం ద్వారానూ, కథల ద్వారాను సాధించారనుకుంటా- 'యానాం చరిత్ర'ను రాశాడు- స్థల కాలాల గతాన్ని అధ్యయనం చేశాడు- చరిత్రని పొరలు పొరలుగా వలిచి చూశాడు- చరిత్రని వర్తమానంతో అనుసంధించి వాటి మధ్య సంబంధాన్ని ఒక నిర్మాణ ప్రక్రియగా రికార్డు చేయదల్చి కథలూ, కవితలు రాస్తున్నాడు.
"ఒక కథకుడి జీవితంలోని బయటి పొరల్ని విప్పాల్సి వచ్చినప్పుడు, లోపలి తెరల్ని చీల్చాల్సి వస్తున్నప్పుడే కథ పుడుతుందని నా అభిప్రాయం. అక్షరాన్ని స్వేచ్ఛగా ఎగరేస్తూ మూలాన్ని ప్రతిబింబించటమే కథ చేసే పని అని గుర్తిస్తున్నాను. ఎన్నో జవాబుల్ని రాబట్టుకుని నన్ను నేను సముదాయించుకుంటేనే ఈ కథల్ని రాయగలిగాను.'' దేవదానంరాజు కథకి ముందుమాటలాంటి 'ఒక నేను'లోని వాక్యాలు. ఈ వాక్యాల అర్థాన్ని తర్జుమా చేసుకుంటూ, తను కవిత్వం, కథ రెండూ రాస్తున్నాడనిపిస్తుంది. అతనికి మనఃపూర్వక అభినందనలు-
- శివారెడ్డి
('యానాం కథలు' ముందుమాట)
Saakshi 15,Oct.2012 |
లేళ్ళ మెరక
- దాట్ల దేవదానం రాజు
వానంటే అసహ్యం. వానంటే వెగటు. వానంటే... కడుపులో సుడులు తిరుగుతున్న గాభరా. దిక్కుమాలిన వాన... తోచనివ్వదూ తోచింది చెయ్యనివ్వదూ. ఇంకా కొంపలు మునిగినట్లు ఉరుములు మెరుపులు.
భయం... ఒకటే భయం. అర్జున... ఫల్గుణ... గుండెపై ఉమ్మి తుంపరలు.
తను తప్పు చేస్తున్నాడా... కొడుకు మాటల్లో నిజముందా?
వెంకటపతిరాజు ఆలోచిస్తున్నాడు. తెగని ఆలోచనలు దుఃఖానికి దగ్గర దారి. అయినాసరే, ఆలోచనల పరంపర.
మట్టిని నమ్ముకునే రోజులు పోయాయి. విశ్వాసాలు మట్టికొట్టుకుపోతున్నాయి. మట్టిని నమ్ముకోవడం... మట్టి, మట్టి అంటూ కలవరించడం నేరమా? మట్టి బంగారం అనుకున్నాడు తను. తరతరాల సేద్యం చేటు చేస్తుందనుకున్నప్పుడు కొనసాగించడం తప్పూ అంటున్నాడు కొడుకు.
చేను వెంబడి తిరిగిన ప్రతిక్షణం అమృతఘడియే. రుతువుల భ్రమణం కొత్త ఉత్సాహమై వెలిగేది. దేశం కడుపు నింపే కార్యంలో తనొక గింజనని తలచాడు.
వ్యవసాయంలోని ప్రతి దశనూ తనకు నేర్పిందెవరు... చేను కాదూ! వయసుతోబాటు అనుభవం వచ్చింది. అనుభవాలు పెరిగేకొద్దీ ఎదురుదెబ్బలు తట్టుకునే శక్తి అలవడింది.
విత్తనం జాగ్రత్తచేయడం... నారుపోసి ఆకుమడి సిద్ధం చేయడం... కన్నబిడ్డలా సాకి వూడ్చి... కోత కోసి... పనలు వోపుకట్టి... నెత్తిన వోసి... కుప్పేసి... నూర్పులు నూర్పి... ఎగరబోసి... సంచులు నింపి... ఒక తొలకరి... మరొక దాళ్వాగా... విరామమెరుగని... ఉరుకులు పరుగులు.
కట్టెను కొట్ట పొయ్యిలో పెట్ట అన్నట్టు... అప్పు చెయ్యడం, తీర్చడం... ఇంకా మిగిలిపోయే బాకీలు. అయినా తప్పదు. దూకించాల్సిందే బతుకురథాన్ని. సాంప్రదాయ జీవనాధారం... ఎప్పుడో మెరుస్తుందనే గంపెడాశ. రైతే రాజనే అభిమానధనం... కొండ్ర కలిగినవాడే కోటీశ్వరుడన్న నమ్మకం... వట్టిదేనా... అంతా అబద్ధమూ... ఆత్మవంచనేనా?
'చెప్పింది వినవు. నీ మాట నీదే. వెుండిపట్టు. కాస్త నిదానించి లోకమెలాగుందో చూడు. వ్యవసాయం ఇప్పుడు అక్షరాలా జూదంగా మారిపోయింది. ఇది నేను చెబుతున్న మాట కాదు. శ్రమకు తగ్గ ఫలం ఉండదు. రేయింబవళ్ళు ఒకటే టెన్షన్. ఎందుకొచ్చిన తిప్పలు?' కొడుకు రామరాజు పొడుస్తూనే ఉన్నాడు.
పొలం పేరు లేళ్ళ మెరక. పని గుర్తింపు కోసం పొలాలకు పేర్లుంటాయి. నందనవనంగా పేరు మారుద్దామనుకున్నాడు. ఒకప్పుడు ఇక్కడ లేళ్ళు స్వేచ్ఛగా తిరగేవట. బీళ్ళుగా మారితే రేపట్నుంచి నక్కలు తిరుగుతాయి. చిన్న చెరువు... గట్టు మీద వరుసగా కొబ్బరిచెట్లు... ఆనుకుని పొలం. అనువంశికంగా వచ్చిన వారసత్వపు నజరానా. బతుకు వెళ్ళదీయడానికీ కొడుకు చదువుకీ ఇదే ఆధారమయ్యింది. హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న కొడుకు... చెవిలో ఇల్లు కట్టుకుని ఒకటే పోరు- పొలం అమ్మి తనతో వచ్చి ఉండమని. భార్య లక్ష్మీ వంతపాడింది. తను కోపగించి కసిరితే వూరుకుంది.
వాడన్నట్లుగానే రెండేళ్ళుగా చేను పరీక్ష పెడుతున్నమాట వాస్తవమే. కానీ పరీక్షల్లో నెగ్గినప్పుడే కదా విజయానందం. పిరికివాడిలా పారిపోతే ఎలా?
ఆకుపచ్చని సౌందర్యం కళ్ళముందు సాక్షాత్కరించే తూర్పుగోదావరిలోని ఈ పరిస్థితి కనీవినీ ఎరుగనిది. చూడగలిగే కళ్ళకు ఇక్కడొక తెలంగాణ ఒక రాయలసీమ ఒక ఉత్తరాంధ్ర కనబడతాయి. అంతటా భూసార విలువల వైవిధ్యమే. ఇక్కడి రైతు సమస్యలు కొట్టిపారవేయదగ్గవి కావు. రుజువు తానే. ఈ ఏడాది వరిపంట ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించింది. మీట నొక్కగానే బల్బు వెలిగినంత సులువుగా చేలోకి నీరు పోతుంది. కాదన్నవారెవ్వరు? కానీ జరిగిందేమిటి?
పాడు వాన... పనికిమాలిన వాన... జావకారు వాన... అతివృష్టి శాపం.
చేతికందే ఫలం... నిరాశ మిగిల్చిన వైనం... ప్రకృతి ఆగ్రహం.
తొలకరి పంట పొట్ట మీదుండగా అకాలవర్షంతో పంట దిగుబడి తగ్గింది. అంతేనా?
ఆకాశం నిర్మలంగా ఉంది కదా అని కోతలు పూర్తిచేస్తే పిలవకుండానే వచ్చింది వాన. పనలు నీట తేలేంత కుండపోత. ఈడ్చికొట్టినట్లయింది. గుండె గుభేల్మంది. దిక్కుతోచలేదు. కక్ష సాధింపు అక్కడితో ఆగలేదు. గుండె చిక్కబెట్టుకుని నీరు గమ్మున పోయేందుకు సేళ్ళు వేసి నీటిని దింపాడు. రెండురోజులు పొడిఎండ. పన తిరగేశాడు. మర్నాడు కట్టేత పురమాయించాడు. గట్టుకు తెద్దామనుకునేంతలో మళ్ళీ కొట్టింది. వెుక్క వెులవకుండా ఉప్పునీళ్ళు జల్లించాల్సి వచ్చింది.
దిక్కుమాలిన వాన... వానంటే గగుర్పాటు... వానంటే కలవరం... వానంటే గుండె ఒత్తిడి... విరక్తి... చిరాకు...
దిగాలుపడిపోయాడు. నెమ్మదిగా కళ్ళు ఎరుపెక్కుతున్నాయి.
జట్టుకట్టే లేమిలోంచి... అశక్తతలోంచి... అయోమయంలోంచి... తనమీద తనకే కోపం.
గడ్డిలో తేమ నిలవ ఉండటంవల్ల కుప్పవేయలేం. మరోదారిలేక కుప్పేస్తే గింజకు పాయ తగిలిందంటే రేటు అడ్డంగా పడిపోతుంది. గిట్టుబాటు లేకపోయినా గత్యంతరంలేక అమ్మడానికి సిద్ధపడితే ధాన్యం బేరగాడు ఇచ్చినపుడే సొమ్ము దక్కుతుంది. నెలల తరబడి అరువుకు తోలాలి. ఈలోపులో అవసరాలు తోసుకొస్తుంటాయి. డబ్బుకోసం వెతుకులాట... విషవలయ పంజా... ఇదంతా దండగమారి వ్యవహారంగా తయారయింది. కూలి ఐదొందలు ఇస్తే చేలో వంగుంటాడు. రెండు బస్తాల ధరకు ముగ్గురు కూలోళ్ళు. కొరత... కొరత... మానవ వనరుల కొరత... ఇబ్బడిముబ్బడిగా ఇతర పెట్టుబడులు... పెరుగుతూ... సహనం చిట్లిపోతూ-
కూలోడు మెట్టు దిగడు, వర్షం వస్తే ఇంకాను. ఎవడి ఆతృత వాడిది.
మిల్లోడు మెట్టు దిగే కొంటాడు. దిగుమతి పెరిగితే ఇంకాను. ఎవడైనా జేబు బరువుకే ఆలోచిస్తాడు.
సడలిపోతున్న నమ్మకాల మధ్య... రైతు.
పగులుతున్న విశ్వాసాల నడుమ... రైతు.
అస్తమిస్తున్న సూర్యుడు మరీ కాంతివంతంగా ఉన్నాడు. మేఘాల అంచులు జరీపూతతో మెరుస్తున్నాయి. మామిడిచెట్టు వెుదలులో గోనెసంచి పరచుకుని కూర్చున్నాడు వెంకటపతిరాజు. అతని చూపు ధాన్యం రాశిమీద పడింది. కింద బాగా మెత్త వేసి రాశిపోసిన ధాన్యం. ఒత్తుగా గడ్డితో కప్పి పైన కొబ్బరిఆకుల బరువుంచాడు. తూకం అయ్యాకనే రూపాయిల్లో మారకపు విలువ తెలుస్తుంది. అంతదాకా కంటి ఉజ్జాయింపుతో ఉత్తుత్తి అంచనాతో లెక్కలు కట్టుకోవడమే. గింజలపోగు గుప్పెడు నోట్లుగా మారిపోతుంది.
వెంకటపతిరాజు సుడులు తిరిగిన గాలికి చెదిరిన గడ్డిని సరిచేసి చేతికర్రతో బలంగా ఒత్తాడు. చేలో గుంపులుగా కొంగలు. వెంకటపతిరాజు పొలంగట్టు దిగాడు. వెులకల చిరునవ్వయ్యే జీవధాతువుని అందించే మట్టిని గుప్పెట్లోకి తీసుకున్నాడు. మట్టిలోంచి సన్నగా వినబడే వూసులుంటాయి. వాటిని వినే ప్రయత్నం చేశాడు. గతరాత్రే వూరినుండి వచ్చిన రామరాజు అక్కడకు చేరి తండ్రి వెనకవైపు నిలబడ్డాడు. తండ్రి చేస్తున్న పనిని గమనించసాగాడు. దూరంగా ఉన్న చెట్టుమీంచి పిట్టలు సామూహిక బృందగానం చేస్తున్నాయి.
వెంకటపతిరాజు అరచేతిలోని మట్టి వింతశోభతో ఉంది. ఆ వెలుగు రామరాజు కళ్ళను తాకినట్లనిపించింది.
మెలకువ దాడితో కలలోని అనుభవం మాయమైనట్లు... అంతా భ్రమే.
''ఏం చేస్తున్నావు నాన్నా. అమ్ముడుపోని ధాన్యంముందు ఎందుకిలా కూర్చున్నావు. వయసుకు మించిన శ్రమను నిన్నెవరు చేయమన్నారు? హాయిగా ఇంటిదగ్గర కాలక్షేపం చేసుకుంటే పోలా?'' ఎదురుగానున్న గట్టుమీద కూర్చుంటూ అన్నాడు రామరాజు.
''రాత్రి నువ్వు మాట్లాడిన మాటలు నన్నెంతో కలవరపెట్టాయి. నువ్వన్నది నిజమే కావచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో నూటికి నూరుపాళ్ళు అంగీకరించే మాటే. అయినా, నా మనసుకి సర్దిచెప్పలేకపోతున్నాను. అందుకే నీ బుద్ధి మారాలని మట్టిని ప్రార్థిస్తున్నాను. రైతుకు మట్టే కదా దేవుడు'' వెంకటపతిరాజు అన్నాడు.
రామరాజు తండ్రికేసి చూస్తూ ఉండిపోయాడు.
''రాత్రి టీవీ వార్తల్లో మంత్రిగారి ప్రసంగం విన్నావు కదా. క్రాప్‌హాలిడే చేద్దామనుకుంటున్నది రైతు కడుపు మండికాదట. రాజకీయ శక్తులు ఆడిస్తున్న నాటకమట నిరసనలన్నీ. ధైర్యంగా ఉండండి, అండగా మేం ఉన్నాం అంటున్నాడు. అదంతాసరే, వూళ్ళో గోల నీకు పట్టదా? ఈ సంవత్సరం ఆరునూరైనా క్రాప్ హాలిడే అమలుజరిపి తీరతారట. పంట విరామం చేసి నష్టపరిహారం కోరతారట. ఎవరైనా ఆకుమడి వేస్తే ట్రాక్టర్‌తో దున్నేస్తారట'' రామరాజు అన్నాడు.
''అవన్నీ జరిగేవికాదురా. రైతు జట్టుకట్టి ఉద్యమం చేయడం కల్లోని మాట. పక్కోడి చేలో నీరు వూరి వాడి పంట పాడవుతుందని తెలిసినా నీరు కట్టడం మానడు. ఎవడి స్వార్థం వాడిది. చూస్తూండు, ఏమీ జరగదు. పీతల మంగలంలోని పీత దారే రైతుదీను'' వెంకటపతిరాజు స్థిరంగా అన్నాడు.
నెమ్మదిగా చీకటి ముసురుకుంటోంది.
వెంకటపతిరాజు లేచినిలబడి పంచె దులుపుకున్నాడు. దండి సత్యాగ్రహం సమయంలో గాంధీగారి గుప్పెట్లోని ఉప్పులా మట్టి.
''అన్నీ తెలిసినవాడివి. పొలం అమ్మకం గురించి మరోసారి ఆలోచించు నాన్నా. నా జీవితానికి లోటులేదు. హాయిగా సంతృప్తికరంగా బతికేంత జీతం వస్తుంది నాకు. ఈ ఎకరం అమ్మేసి మంచి కారు కొనుక్కుంటాను. కాలం గతంలోలా లేదు. మారిపోతోంది. సాధ్యమైనంత వరకు సుఖంగా సౌకర్యవంతంగా ఉండటాన్నే అందరూ ఇష్టపడుతున్నారు. పిల్లల్ని స్కూలుకి దింపడం కష్టమౌతోంది. అందరికీ కార్లున్నాయనీ మనకే లేదనీ పిల్లలు గోలపెడుతున్నారు. వాళ్ళ సరదా కూడా తీర్చినట్లుంటుంది'' అని కాసేపాగి-
''వూళ్ళో సంగతులు నీకేమీ తెలిసినట్టు లేదు. రైతులీసారి పట్టుదలగా ఉన్నారు. క్రాప్‌హాలీడే తప్పదనుకుంటున్నారు. అదలా ఉంచి వ్యవసాయం వెలగబెడితే వచ్చేదేముంది?'' సూటిగా ప్రశ్నించాడు రామరాజు.
''పిల్ల కాకికేం తెలుస్తుంది ఉండేలు దెబ్బ. అన్నీ జరిగి పంట విరామం చేస్తే సారవంతమైన పొలం బంజరుభూమిగా మారుతుంది. అమ్మకం పెట్టినా ఎవడూ కొనడు. తొండలు గుడ్లు పెట్టుకుంటాయి. అపుడెవరికి కావాలి? వ్యవసాయం మీద ఆధారపడి బతికేవోడు మరోపని చేయగలడా? గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటే పొద్దు గడవొద్దా?''
''అక్కడే ఉంది అసలు కిటుకు, నాన్నా. ఆ భయం అక్కర్లేదు. గడ్డు పరిస్థితుల్లో కూడా భూమి రేటు నిలకడగానే ఉంటోంది. అనంతపద్మనాభస్వామి దేవాలయం నేలమాళిగలో దాచినట్లు డబ్బూ బంగారం ఎవరూ దాయరు. భూమి కొనుక్కుంటే స్థిరాస్తిగా ఉంటుంది. అందుకే భూమిమీద వోజు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్కెటు రేటుకి తగ్గించి అవ్మెుద్దు. అట్లాంటి బేరం వస్తేనే అమ్ముదాం సరేనా. ఇక ఇంటికి వెళదాం పద నాన్నా'' అన్నాడు రామరాజు.
''నువ్వెళ్ళరా, నేను తర్వాత వస్తాను.''
రామరాజు వెళ్ళిపోయాడు. వెంకటపతిరాజు ఉస్సురని నిట్టూర్చాడు.
'పిదప కాలం పిదప బుద్ధులు' అనుకున్నాడు.
అడవుల్నీ సముద్రాల్నీ నదుల్నీ కాలువల్నీ పంటపొలాల్నీ వంతెనల్నీ దాటుకుంటూ ఆకాశంలోంచి వూడిపడ్డట్టు నినాదాలతో జడత్వ ప్రాతినిధ్యం కిందికి దిగివస్తుందా?
కొత్త శక్తితో కదనుతొక్కుతూ రైతులంతా ఒక్కటిగా నిలుస్తారా?
అవునో కాదో వెంకటపతిరాజుకు అవసరం లేదు. చేయదగిన పనిమీదే పూర్తి నమ్మకం. సానుకూల ఫలితాలు వచ్చితీరతాయి. శ్రమ నిరంతరంగా కొనసాగాల్సిందే.
కాలం అన్యాయం చెయ్యదు. పరిస్థితులు తప్పక మారతాయి. రైతు మళ్ళీ రాజవుతాడు. దేశజనం గుండెల్లో కొలువుంటాడు. వెన్నెముకలాంటి రైతు ఎప్పటికీ వంగిపోడు. రైతుని గౌరవించే రోజులొస్తాయి. రైతు పూజలందుకుంటాడు.
ఆలోచనలు కొండంత బలాన్ని ఇచ్చాయి వెంకటపతిరాజుకు. ఆయన ముఖంలో అనిర్వచనీయమైన ఆనందం. కోటిజ్యోతుల కాంతి. మనసు తేలికపడిన ఛాయలు.
చిరునవ్వుతో తన పొలాన్ని చూసుకున్నాడు. చీకటిలో సైతం హద్దులు కనిపిస్తున్నాయి. పోగొట్టుకున్నచోటే వెతుక్కోకపోతే వాడు మనిషే కాడు. చీకటిలో చేను చుట్టూ తిరిగాడు. గుప్పెటలో మట్టి అలాగే ఉంది. చేతిని సమాంతరంగా చాపి మరోసారి అనుకున్నాడు, మట్టి అన్యాయం చెయ్యదని.
అకస్మాత్తుగా కళ్ళు చెమ్మగిల్లాయి. ఉబికివస్తున్న కన్నీళ్ళని తువ్వాలుతో తుడుచుకున్నాడు.
ఆఖరిసారిగా ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగా అనుకున్నాడు- 'ఇంత భూమీ నాలుగు చక్రాలు తొడిగించుకుని బిరబిరా కదిలిపోతుందా? రోడ్డుమీద తిరిగే వాహనం అవుతుందా? పెట్రోలు నింపుకుని వూళ్ళు వూళ్ళు తిరుగుతుందా? లేళ్ళమెరక నా శరీరంలో ఒక భాగం. ఇది నా వూపిరి. వాడి వెర్రిగానీ నా ప్రాణం ఉన్నంతవరకు దీన్ని వస్తుమార్పిడి చేయడానికి ఒప్పుకోను. నేనూ నా పొలం ఒకరికొకరంగా కాలాన్ని ఈదుతాం. వర్షం, తుపానులెన్ని వచ్చినా పారేసుకున్నచోటే వెతుక్కుంటాను.'
వెన్నెల్లో వెంకటపతిరాజు చూపు పట్టపగల్లా కనబడుతోంది. ఉల్లాసంగా ఇంటిముఖంపట్టాడు.
లోపలి సడి - దాట్ల దేవదానం రాజు
నాలో ఉద్వేగం. అనేకానేక భావ సంచలనాల సడి కుదిపేస్తూంది.
ఇంకా గంట వుంది. నాలో ప్రకంపనాలు మొదలయ్యాయి.
పదకొండూ నలభై అయిదు కోసం ఎదురుచూడాలి.
నార్మల్ విన్సింట్ పీలే పవర్ ఆఫ్ పోజిటివ్ థింకింగ్ కాసేపు తిప్పుదామని తీశాను. ఇంతట్లో రిమోట్‌తో తగ్గించలేని రొద.
ఇంట్లో చానల్ మార్చడమే కష్టం. సౌండ్ తగ్గింపు పర్వాలేదు. హాలులోకి వెళ్ళి చప్పుళ్ళ పీక నొక్కాను.
గదిలోకొచ్చి కిటికీ దగ్గరకు నడిచాను. కిటికీ తలుపుతీసి రోడ్డు వార జోళ్ళు కుట్టే వాడికేసి చూశాను. వేలికి గుచ్చుకున్న సూది బాధ ఓర్చుకుంటున్నాడు, పళ్ళ బిగువన. కిటికీ తలుపు మూసి మంచం మీద కూర్చున్నాను.
ఎంతకీ నిముషాల ముళ్ళు కదిలి కదిలి గంట అవ్వదేం? బ్యాటరీ సెల్ వీక్ అయినట్లు కాలం నెమ్మదిగా కదులుతుందా?
గోడ మీద సాయం సంధ్య చిత్రం. నది అలజడిగా వుంది... నురుగులు ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి... తీరాన రాటకు కట్టిన నావ... దూరంగా తెల్లగా ఎగురుతున్న పక్షులు... మేఘాలు... నీటి మీద వాటి నీడ... ఎరుపు పులుముకున్న వాతావరణం... రోజూ చూస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు వింత అనుభూతి.
మరో గోడ మీద పర్వతాలు... లోయలు... పసిడి పువ్వుల మొక్కలు - నేను మంచి గొఱ్ఱెల కాపరిని, నా గొఱ్ఱె నాకు తెలుసు - దిగువన ఇంగ్లీషు అక్షరాలు.
మీద తిరుగుతున్న ఫ్యాను. ఇలా పడుకుండనే ఎపుడో ఊడి పడి పోతుందన్న ఫీలింగు... అలవాటైన చప్పుడు...
ఈ వేళ రాజ్‌కుమార్ చెప్పిన సమయానికి తప్పక మాట్లాడాలి. పావు తక్కువ పన్నెండు గంటలకు మాట్లాడమన్నాడు. నేను ఇస్తానన్న డబ్బుకి పని జరుగుతుందో లేదో చెబుతానన్నాడు.
పని అవుతుందో లేదో ఈ వేళ తేలి పోవాలి. కొంచెం గౌరవంగా నెమ్మదిగా ప్రాధేయపడుతూ మాటలు చెప్పాలి. అవతలి మాటల్ని శ్రద్ధగా వింటూ వినమ్రత చూపాలి.
టైమెంతయ్యిందో?
చచ్చీ చెడి అరగంట కూడ కాలేదు. ఇంకా ఒక అర్గంటను ఈడ్చాలి. ఒకటే టెన్షన్ పెరిగిపోతూంది.
ముందు టెన్షన్ తగ్గాలి. ఆలోచనల్ని పక్కదారి పట్టిస్తే మాట్లాడాల్సిన విషయం రిహార్సల్ దెబ్బతింటుందేమో...! గొంతు సవరించుకున్నాను, మైకు ముందు మాట్లాడేవాడిలా. వంట గదిలో కెళ్ళి ఫ్రిజ్‌లోంచి మంచినీళ్ళు తాగాను. తిరిగొచ్చి తలుపులు బిగించాను.
రాజ్‌కుమార్ తనే చేస్తాడేమో? వాడి దగ్గర నా ఫోను నెంబరుంది.
వాడెందుకు చేస్తాడు? అవసరం నాది. నిజంగా అతను ఫోన్ చేస్తే నేనెనం మాట్లాడాలో అనుకోలేదు కూడా.
ఖచ్చితంగా అతను చేయడుగాక చేయడు. గదిలో ఫ్యాను హోరు... కరకరమని మింగుతానంటుంది. అంతర్లీనంగా నలుగుతున్న ఆలోచనలు మూగగా... చేతిలో పుస్తకాన్ని గది మూలకు విసిరేసాను.
బీరువా తాళం తీసి డబ్బు కట్టలు బయటకు తీసాను. ఒకసారి అరచేతిలో తూకం వేసుకుంటూ "ఇవన్నీ వాడికిచ్చేయాలి... అయినా ఒప్పుకుంటాడో లేదో...ఒప్పుకుంటేనే బాగుండును. ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేను"
ఖరీదు పెట్టి కొనకుండా ఏదైనా ఎలా వస్తుంది? భయం భయంగానో, అవసరంగానో కొనాల్సిందే. గుట్టు చప్పుడు కాకుండా కొనే సరుకులూ ఉంటాయి.
గదంతా చిందరవందరగా వుంది. ఇలాగుండటమే నాకిష్టం. సర్దితే మనుషులు మసలుతున్నట్లు అనిపించదు. ఎక్కడబడితే అక్కడ పేజీలు ఎగురుతూ కనిపించాలి. పేజీలు పిలుస్తున్నట్లుంటేనే గమ్మున ఆపుస్తకం చదవాలనిపిస్తుంది. నీటుగా పేర్చిన పుస్తకాలు ఇక చదవడమెందుకు? ఒక ఫలానా టైము కోసం ఎదురుచూడ్డం ఒక రకంగా శిక్షేనా?
ఇరవై నిముషాలుంది.
ఫోన్ దగ్గరకు కుర్చీ జరిపాను.
కుర్చీ మీద కూర్చుని ఊపిరి పీల్చాను, ఫోను ముట్టుకుని రిలాక్స్‌గా కుర్చీలో వెనక్కి వాలి...
కాలింగ్ బెల్ చప్పుడు.
'ఇపుడెవరొచ్చారో... నన్ను చంపుకు తినడానికి' ఉస్సురని లేచాను.
బయటకు రాగానే చందాల పుస్తకం ముఖం ముందు పెట్టాడు. రక్తదానాలు చేసేవాడట. రోజూ ఆస్పత్రిలో రక్తం దానం చేస్తాడట. తెల్లగా పాలిపోయి వున్నాడు. వాడి పుష్టికరమైన ఆహారానికి చందా కావాలిట. అంతా నాటకం. పొట్టకూటికి కొత్తగా చేరిన వృత్తి భాగోతాలు. తెలుసున్నవాడిలా స్నేహంగా నవ్వుతున్నాడు.
"ఇలా అడుక్కోవడానికి పోలీస్ స్టేషన్‌లో పర్మిషన్ తీసుకున్నావా? ఎదీ కాగితం?"
బిక్కమొహం వేసాడు వెర్రి పీనుగ.
"పోరా...పో..." ఒక్కుదుటున తలుపులు మూసి లోపలికొచ్చేసాను.
రాజ్‌కుమార్ పేరులో హుందాతనం వుంది. జీన్స్ ప్యాంట్...టీ షర్ట్...బెల్టు... దానికి సెల్‌ఫోను... స్టైల్‌గా...
సెల్ నంబరు లేదు నా దగ్గర.
అతను ఇపుడే అక్కడే నెంబరు దగ్గర వుంటాడా? చెప్పిన టైముకు దొరుకుతాడా?
'అవతల తీవ్రవాదంతో ప్రపంచం మండిపోతూంది'
'ఒక దేశంలో రెండు బిల్డింగులు కూలిపోతే... లోకానికి వచ్చే తిప్పలు అన్నీ ఇన్నీనా?'
'పాకిస్తాన్ వాడికి ఈసారి బాగా అవుతుంది... అహహా...'
'కొడుకుని చంపిన తండ్రి...తాగొచ్చిన కొడుకు దౌర్జన్యం భరించలేక...ప్చ్...పాపం'
'వాకింగు చేస్తూ గుండెపోటుతో... హరీ...'
'ఫైనాన్స్‌కంపెనీల చీటింగు...డిపాజిట్‌దారుల గగ్గోలు'
లేదు. ఇక నెంబరు కోట్టాలి.
నాకు బాగా తెలుసున్న నంబరే. అయినా డైరీ చూడాలి.
అవునూ, డైరీ ఏదీ?
లైటు వేసాను.
డైరీ వెదికి తెచ్చి నంబరుగల పేజీని ఒక చేత్తో అదిమి పట్టుకుని రెండో చేత్తో ఫోను రిసీవరు చెవికి ఆనించుకుని భుజంతో బేలన్సు చేసుకుని నొక్కుకుంటూ... చేతిని నెమ్మదిగా కిందికి విడిచి... వేలితో ఒక్కో నెంబరునీ...
అంత గట్టిగా అంకెల్ని నొక్కుతారేంటి, అసహ్యంగా అంటాడు మావాడు. నేనెప్పుడూ పట్టించుకోలేదు. ఇపుడు మాత్రం అతి సుతారంగా నొక్కుతున్నాను. రాజ్‌కుమార్‌కు అసలు దెబ్బ తగలకూడదు.
రింగవుతూంది. రాజ్‌కుమార్ నా ఎదురుగా కూర్చున్నట్లు ఫీలవుతున్నాను. కొంచె ముందుకు వినయంగా వంగాను. ముఖంలోకి చిరునవ్వు తెచ్చుకున్నాను.
చెమటతో తడిసి ముద్దవుతూ... చెవిలో రహస్యం చెప్పేవాడిలా ఊపిరి బిగపెట్టుకుంటూ...
రింగవుతూంది. ఎవరూ ఎత్తడం లేదు.
కాస్త ఊపిరి పీల్చుకున్నాను. డాక్టరు బి.పి.నియంత్రణ కిచ్చిన మాత్రలు ఎపుడూ మరచిపోను. రక్తం వేగంగా శరీరంలో పరుగెడుతూంది.
క్షణక్షణం అవతలవైపు ఫోన్ ఎత్తిన క్లిక్‌మనే చప్పుడుకు ఎదురుచూపు.
రింగ్ ఆగిపోయింది. ఫోన్ పెట్టేసాను.
అమ్మయ్య అనుకున్నాను. ఎందుకో వెనుకగా వెచ్చని ఊపిరి... ఎవరో ఏదో చెబుతున్నట్లు... వెనక్కి తిరిగాను. మళ్ళీ కంచెలతో బాదినట్లు... ముఖం నిండా పేడ పులుముకుని... గజ్జికుక్క ఏడుపులాంటి నవ్వుతో...
ఎవరైనా కనబడతారేమోనని చూసాను; ఎవరూ లేరు.
'అంతా భ్రాంతియేనా జీవితాన...'
రాజ్‌కుమార్ నెంబరు మళ్ళీ నొక్కాను, అతి జాగ్రత్తగా. రాజ్‌కుమార్ చాలా మంచివాడు. చాలా అందంగా మాట్లాడతాడు. కలుపుగోలుగా వుంటాడు. స్పష్టంగా తను చెప్పాల్సింది చెబుతాడు. అహం మచ్చుకి కనబడదు.
రాజ్‌కుమార్‌ని తప్పుపట్టలేను. రాజ్‌కుమార్‌లు సమాజంలో అంచెలంచెలుగా ఎదుగుతారు. వ్యవస్థలోని చట్టాల్ని బహునేర్పుగా తమకు అనుకూలంగా మార్చుకుంటారు. డబ్బులు సంపాదిస్తారు. అదృష్టం అంతా రాజ్‌కుమార్‌దే.
మరలా రింగవుతూంది. అక్కడెవరో వున్నట్లు లేదు.
రాజ్‌కుమార్‌కి ఏదైనా ప్రమాదం జరిగిందా?
ఎముకలు విరిగి... ఆస్పత్రి పాలయ్యి... కట్టులతో... హృదయ విదారకంగా...
నో... నో... అలా జరగకూడదు.
నా పని తప్పకుండా రాజ్‌కుమార్ చేస్తాడు. మంచివాడైన రాజ్‌కుమార్ మాట తప్పడు.
బేరాన్ని ఎవరైనా తన్నుకుపోతారేమో... భయం... నాకుండక్కర్లేదు.
'రాజ్‌కుమార్‌తో ఈవేళ ఇంక మాట్లాడలేను' విచారంగా అనుకున్నాను.
కరెంటు మళ్ళీ మళ్ళీ పోతున్న ఆనవాళ్లు ఎవరూ చెరపలేరు. చీకటి వెలుగుల ఆటలు ఎవరూ తప్పించుకోలేరు.
మావాడికి ఉద్యోగం చాలా అవసరం. ఉద్యోగం లేక మానసిక వేదన అనుభవిస్తున్నాడు. అది రాజ్‌కుమార్ చేతిలో వుంది. నా శక్తికి మించి పోగు చేసిన డబ్బులు వాడి మొఖాన కొట్టాలి... సారీ...
అటునుంచి రాజ్‌కుమార్ మాట్లాడితే బాగుండును. అతను మాట్లాడడు.
నేనే వెళ్లాలి, మాట్లాడాలి, ఎప్పటికైనా...
(ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 1,జూన్,2002 సంచికలో ప్రచురితం)
.............................
.............................
No comments:
Post a Comment